డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 26(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్టి వెంకన్న డిమాండ్ చేశారు.మండలంలోని బుర్హాన్ పురం గ్రామంలో బుధవారం జరిగిన రైతు సంఘం 5వ మండల మహాసభకు తాటికొండ అనంతాచారి అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చెట్టి వెంకన్న మాట్లాడుతూ..నేడు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల రైతుల మెడకు కత్తి వేలాడుతోందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం విత్తన చట్టం,విద్యుత్ సవరణ చట్టం,ఎరువుల విధానం,పంట భీమా చట్టం,నీటి విధానం వంటి ప్రమాదకరమైన,కార్పొరేట్ అనుకూల చట్టాలను తీసుకొస్తోందని,వీటికి వ్యతిరేకంగా మరిపెడ మండల రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో రైతుల పక్షాన పోరాడేటందుకు మేము వెనుకాడబొమని,రెండు లక్షల రుణమాఫీని పూర్తిగా చేయలేదని,రైతు భరోసాను రెండు సీజన్లలో ఇవ్వలేదని,ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చినా రైతుల కష్టాలు తీరలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య,సీఐటీయూ నాయకులు గుండగాని మధుసూదన్ లు మాట్లాడుతూ..రాష్ట్రంలో నకిలీ విత్తనాలు,పురుగు మందుల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నా నకిలీ మందులను,నకిలీ విత్తనాలను అరికట్టడంలో రాష్ట ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని అన్నారు. వరి కొనుగోలు సందర్భంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల తరుగు పేరుతో 3 నుండి 4 కిలోలు తరుగు పేరుతో తీస్తున్నారని,దీనిని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా బస్తాలను ఆన్లైన్ నుంచి తొలగించాలని,లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కందాల రమేష్,గిరిజన సంఘం ఉపాధ్యక్షులు మాలోతు కిషన్,సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొండ ఉప్పలయ్య,శ్రీనివాస్ రెడ్డి,నలబోలు లక్ష్మారెడ్డి,బయ్యా సురేష్,ఎస్కె షరీఫ్,చిన్నబోయిన, గంధసిరి మహేష్, కెవిపిఎస్ మండల నాయకులు వడ్లకొండ గంగరాజు, ఉప్పలయ్య, నలబోలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

