తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వాసితుల ధర్నా
భూమి పోయింది.. నష్టపరిహారం రాలేదు – ఆవేదనలో రైతులు
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 25 (నమస్తే న్యూస్ )
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నీరు పేద రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసిత రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.లప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం రైతుల భూములను వినియోగించుకున్నప్పటికీ, పలువురు రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని కోల్పోయి జీవనాధారం దెబ్బతిన్నా అధికారులు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.ఈ ధర్నాకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్, ఎంఎస్ఎఫ్, బీఎస్పీ నాయకులు మద్దతు ప్రకటించి నిర్వాసిత రైతులకు అండగా నిలిచారు.ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ( AIKMS) రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులందరికీ ప్రభుత్వం న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర భూ రికార్డులు ఉన్నప్పటికీ నష్టపరిహారం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అధికారులు వెంటనే గ్రామాల వారీగా భూముల వివరాలను పరిశీలించి, పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని గుర్తించి అర్హులైన రైతులందరికీ తక్షణమే చెల్లించాలని కోరారు. రైతుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తే నిర్వాసిత రైతులతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ నాయకులు న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కొర్రపాటి రమేష్ ఎంఎస్ఎఫ్ మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు నాగభూషణం టిఆర్ఎస్ మండల నాయకులు గంటా కృష్ణ బీఎస్పీ పాలేరు నియోజకవర్గ నాయకులు ఎన్నబోయిన రమేష్ కొమ్ము పూలే బాధితులు నరసయ్య దాసు రంజిత్ ఉపేందర్ భారతమ్మ వెంకటలక్ష్మి ఉప్పలమ్మ రమేష్ యశోద ఎల్లమ్మ సునీత పూలమ్మ చిన్న గురవయ్య తదితరులు పాల్గొన్నారు.


