తగ్గుతున్న వర్షపాతం, భూగర్భ జలాలపై రైతులు దృష్టి సారించాలి
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి
-ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డి
ప్రతి పంట వివరాల డిజిటల్ నమోదు.. రైతులు సహకరించాలి: ఏవో అనిల్‌కుమార్
డోర్నకల్, ఆగస్టు 25 (నమస్తే న్యూస్):
మారుతున్న వాతావరణ పరిస్థితులు, తగ్గుతున్న వర్షపాతం, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో రైతులు సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని ఆత్మ మరిపెడ డివిజన్ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డి సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపితే పెట్టుబడి తగ్గడంతో పాటు మంచి దిగుబడులు, లాభాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.డోర్నకల్ మండలం గొల్లచర్ల రైతు వేదికలో ఆత్మ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్పీఎల్ ఆధారిత రైతు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి రైతు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. పంటల ఎంపికలో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు.
ప్రతి పొలానికి వెళ్లి పంటల నమోదు
మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. డోర్నకల్ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో డిజిటల్ పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. పంటల వివరాలను నమోదు చేసేందుకు ప్రతి గ్రామానికి వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాలంటీర్లు నేరుగా రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటల ఫొటోలు తీసి, సాగు చేసిన పంట, విస్తీర్ణం తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని వివరించారు.
డిజిటల్ పంటల నమోదు భవిష్యత్‌లో పంటల కొనుగోళ్లు, ప్రభుత్వ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు కీలకంగా మారే అవకాశం ఉన్నందున రైతులందరూ వాలంటీర్లకు సహకరించి తమ పంట వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు.
ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌పై అవగాహన
నెలాఖరులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అందుబాటులోకి రానుందని అనిల్‌కుమార్ తెలిపారు. యాప్ వినియోగం, రైతులకు దాని ద్వారా అందే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో వినియోగించుకోవడం ద్వారా పంటల వివరాల నమోదు, పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో శ్రీదేవి, కస్నాతండా సర్పంచ్ శంకర్‌నాయక్, ఆత్మ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, అనంతరెడ్డి, వెటర్నరీ డాక్టర్ నాగేశ్వరరావు, ఏఈవోలు అవినాష్, పవన్, అనూష, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.

