రామన్నపేట, ఆగస్ట్ 25( నమస్తే న్యూస్)
రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంచిన సారంపల్లి మల్లారెడ్డి పార్థివదేహాన్ని స్థానిక సిపిఎం నాయకులతో కలిసి సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి తన జీవితాంతం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, రైతుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని అన్నారు. రైతు సమస్యలపై కేవలం ఉద్యమాలు చేయడమే కాకుండా, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలకు సైతం సలహాలు, సూచనలు అందించే స్థాయిలో ఆయనకు లోతైన అవగాహన ఉండేదని తెలిపారు.అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, వాటి ప్రభావాలను భారత వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ పార్టీ, రైతు సంఘం శిక్షణా తరగతుల్లో కార్యకర్తలకు బోధించేవారని అన్నారు.వ్యవసాయ రంగంపై ఆయనకు ఉన్న విస్తృతమైన అవగాహన, అనుభవం అనేక తరాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వనరుల వినియోగం, సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యామ్నాయ పంటలు, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల ఆర్థిక సమస్యలు తదితర అంశాలపై సారంపల్లి మల్లారెడ్డికి అనర్గళమైన పట్టు ఉండేదని మేక అశోక్ రెడ్డి అన్నారు. రైతాంగ ప్రయోజనాలకు అనుగుణంగా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్రాంతానికనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలపై ఆయన నిరంతరం చర్చిస్తూ, ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లేవారని తెలిపారు.రైతాంగ ఉద్యమాన్ని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు తీసుకెళ్లడంలో సారంపల్లి మల్లారెడ్డి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. రైతు సంఘం ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతు ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఆయన ఆలోచనలు, అనుభవాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మేక అశోక్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య,నాయకులు వనం ఉపేందర్, రైతు సంఘం నాయకులు గన్నేబోయిన విజయభాస్కర్,అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

