ప్రకృతితో మమేకమై.. భవిష్యత్తు తరాలను కాపాడుకుందాం
వనమహోత్సవంలో మొక్కలు నాటిన మండల స్థాయి అధికారులు
ఒక్కో మొక్క.. ప్రకృతికి కొత్త ఊపిరి
నర్సింహులపేట,ఆగస్టు 25 (నమస్తే న్యూస్)
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రజలందరూ కృషి చేయాలని మండల స్థాయి అధికారులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కొమ్ములవంచ రోడ్డుకు ఇరువైపులా సోమవారం ఘనంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలను నాటడంతో ఆ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. నేడు నాటిన ఒక్కో మొక్క భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.ప్రకృతిని పరిరక్షించడం ద్వారా మాత్రమే భావితరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని అధికారులు తెలిపారు. గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా వనమహోత్సవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.“ప్రకృతిని ప్రేమిద్దాం.. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రపంచాన్ని అందిద్దాం. ఒక్కో మొక్కను నాటి, దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి కొత్త ఊపిరి పోద్దాం” అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాస యాకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


