క్షేత్రస్థాయిలో పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం
మహబూబాబాద్, ఆగస్టు 25 (నమస్తే న్యూస్)
ప్రజల విశ్వాసాన్ని పొందడమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అన్నారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం సందర్శించిన ఆయన స్టేషన్‌లోని రికార్డులు, కేస్ డైరీలు, CCTNS నిర్వహణ, పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడి వారి విధి నిర్వహణ, సమస్యలపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతి కేసు దర్యాప్తులో క్షేత్రస్థాయిలో పర్యటించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.VPOలు ప్రతి వారం తమ పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సన్నిహితంగా ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, గుడుంబా, ఇతర అక్రమ మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని, క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు.ఈ తనిఖీలో సీఐ అంజలి, డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ రాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


