రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం
వివరాలను వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
వరంగల్ బ్యూరో ,ఆగస్టు 25 (నమస్తే న్యూస్)
యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి గంజాయి రహిత సమాజం లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా దామెర పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి వివరాలను వెల్లడించారు.నిందితుడి నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో దామెర పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టి పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్రావు (55)ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యక్తులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత రెడ్డి తెలిపారు.

