పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన
బయ్యారం, ఆగస్టు 25 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామపంచాయతీలో 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ వర్స దీప ప్రకాష్దొర, ఎంపీడీవో దీపిక ఆధ్వర్యంలో ఏకలవ్య పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలతో కలిసి మాస్ ప్లాంటేషన్ చేపట్టి సుమారు 200 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ దీప మాట్లాడుతూ.. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పర్యావరణంలో మార్పుల కారణంగా వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వర్షాభావం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో అవసరమని, మొక్కలు నాటడంతో భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, మెరుగైన వాతావరణం అందుతుందని విద్యార్థులకు వివరించారు.వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం గ్రామపంచాయతీ విధులు, పాలన, పరిపాలనా విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ వ్యవస్థ పాత్రను వివరించారు.కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, ఏపీవో సజన్ స్వరూప్, గ్రామ కార్యదర్శి వెంకటరమణ, ఉపసర్పంచ్ సూర్నపాక సుజాత వెంకన్న, వార్డు సభ్యుడు చీమల కృష్ణ, వీవోఏ గగ్గల కృష్ణకుమారి, పీసా మొబిలైజర్ జార సంతోష, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


