అధికారుల సమన్వయంతో చిన్నగూడూరు మండల అభివృద్ధి
అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. రామచంద్రునాయక్

చిన్నగూడూరు, ఆగస్టు 25 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే రామచందర్ నాయక్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.విధుల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే రామచందర్ నాయక్ హెచ్చరించారు. మండల అభివృద్ధికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

