విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ డిమాండ్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం, ఆగస్టు 24 (నమస్తే న్యూస్)
సుబ్లేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంటనే అవసరమైన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. సుబ్లేడు ఆసుపత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుబ్లేడు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు, పరీక్షా పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు మరియు మందులు అందించాలని ఆయన కోరారు.ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గొర్రెపాటి రమేష్ హెచ్చరించారు.

