ఊడిపడుతున్న పెచ్చులు.. ఎప్పుడు కూలుతుందో తెలియదు.. ప్రత్యామ్నాయ భవనం కూడా ప్రమాదకరమే..!
పశువులకు వైద్యం.. సిబ్బందికి ప్రాణభయం.. నర్సింహులపేట పశు వైద్యశాల దుస్థితి!
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా…?
పశు వైద్యశాలపై నమస్తే న్యూస్ ప్రత్యేక కథనం

నర్సింహులపేట,ఆగస్టు 24 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రాథమిక పశు వైద్యశాల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాథమిక పశు వైద్యశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో, పక్కనే ఉన్న పాత గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి పశు వైద్యశాలను మార్చారు. అయితే ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసిన ఆ భవనం కూడా శిథిలావస్థలో ఉండటంతో సిబ్బంది, పశుపోషకులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల కథనం ప్రకారం, 1981లో అప్పటి సర్పంచ్ నాగిని మనోహర్ రెడ్డి హయాంలో గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మించబడింది. దశాబ్దాల నాటి ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇలాంటి భవనంలోనే పశు వైద్యశాలను కొనసాగించడం ఎంతవరకు సమంజసమని పశుపోషకులు ప్రశ్నిస్తున్నారు.భవనం పైకప్పు పెచ్చులు, సిమెంట్ ముక్కలు తరచూ ఊడి కిందపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏ భాగం కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో వైద్యశాల నిర్వహణ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు వైద్యం కోసం వచ్చే రైతులు, పశుపోషకులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు.ఒక శిథిల భవనం నుంచి మరో శిథిల భవనానికి కార్యాలయాన్ని మార్చడమే పరిష్కారమా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ప్రమాదకర భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తూ, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.తక్షణమే పశు వైద్యశాలకు నూతన భవనాన్ని మంజూరు చేసి, సురక్షితమైన ప్రదేశంలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు, పశుపోషకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



