తిరుమలాయపాలెం,ఆగస్టు 24 (నమస్తే న్యూస్ )
ప్రస్తుత వానాకాలం సీజన్లో సన్న రకం ధాన్యం సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు ₹500/- బోనస్ దక్కించుకోవాలంటే ఆన్లైన్ నమోదు తప్పనిసరని మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామ్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్దేశిత ఏడు రకాల సన్న వడ్ల సాగుదారులకే ఈ లబ్ధి చేకూరుతుందని, అన్నదాతలు నిర్లక్ష్యం వీడి గడువులోగా వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.బోనస్ దక్కే సన్న రకాలు ఇవే..ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. బీపీటీ,–5204 (సాంబమసూరి), ఆర్ ఎన్ ఆర్ -15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటి సోనా, జై శ్రీరామ్, కే ఎన్ ఎం -1638 (కూనారం సన్నలు), WGL-44 (సిద్ది), కే ఎన్ ఎం -7715 రకాలకు మాత్రమే క్వింటాలుకు ₹500 బోనస్ వర్తిస్తుంది. ఇతర రకాలకు ఈ ప్రయోజనం ఉండదని అధికారి తేల్చిచెప్పారు.నమోదు ఇలా.. కావాల్సిన పత్రాలు:డీలర్ల వద్ద కొనుగోలు చేసిన వారు: విత్తనం కొనుగోలు బిల్లు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్, డిక్లరేషన్ ఫారంతో విత్తన డీలర్‌ను సంప్రదించి ఆన్లైన్ చేయించుకోవాలి .సొంత విత్తన రైతులు: సొంత విత్తనాలు, ఇతర రైతులు లేదా పరిశోధనా కేంద్రాల నుంచి విత్తనం పొందిన వారు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ కి ‘రైతు ధృవీకరణ పత్రం’ రైతు డిక్లరేషన్ సమర్పించి నమోదు పూర్తి చేసుకోవాలి.తిరుమలాయపాలెం మండల పరిధిలోని సన్న వరి సాగుదారులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏమార్పాటుతో నష్టపోవద్దని వ్యవసాయ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

