రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 24 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని పేద, నిరుపేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, ఉపాధి హామీ చెల్లింపులు, విద్య, అంగన్వాడీ, ప్రభుత్వ వైద్య సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బి ఎస్ పి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు గ్రీవెన్స్ అధికారికి వినతిపత్రం అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో గతంలో 100కు పైగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ, లబ్ధిదారులకు ఇప్పటివరకు స్థలాలను చూపించి అప్పగించలేదని వారు తెలిపారు. నాలుగైదేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు స్థలాలను గుర్తించి వెంటనే అప్పగించాలని కోరారు.
అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఫోటోలు, కొలతలు, ఇతర ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి పెండింగ్ బిల్లులు, ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించిన చెల్లింపులను సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు.
మండలానికి మంజూరైన ఐటిఐ కళాశాలను వెంటనే ప్రారంభించాలని, దాదాపు 80 శాతం పనులు పూర్తయిన అంగన్వాడీ సెంటర్–2 భవనానికి మిగిలిన పనులు పూర్తి చేసి చిన్నారుల వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
తిరుమలాయపాలెం సి హెచ్ సి ఆసుపత్రి లో పేదలకు అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా X-Ray, గర్భిణీలకు స్కానింగ్, చిన్నారులకు అవసరమైన ఫోటోథెరపీ తదితర సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర వైద్యం కోసం పేదలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, కాలపరిమితితో పరిష్కరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి పాలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొమ్ము పూలే, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల నాయకుడు కొమ్ము నితీష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

