చత్తీస్‌గఢ్‌లో జరిగే టోర్నీలో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం
హర్షం వ్యక్తం చేస్తున్న మరిపెడ మండల ప్రజలు

.డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 24(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర అండర్-14 క్రికెట్ జట్టుకు మరిపెడ మండలానికి చెందిన మేరుగు జశ్వంత్ ఎంపికయ్యాడు.ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన అండర్-14 జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ప్రతిభ కనబరిచిన జశ్వంత్ ఆటతీరును గుర్తించిన సెలక్టర్లు రాష్ట్ర జట్టులో చోటు కల్పిస్తూ సోమవారం జట్టును ప్రకటించారు.ఈ నెల 26,27,28,29 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చంపా జిల్లాలో జరగనున్న అండర్-14 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు తరఫున జశ్వంత్ పాల్గొననున్నాడు.మరిపెడ మండలానికి చెందిన మేరుగు జశ్వంత్ స్థానిక సెయింట్ అగస్టీన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ఆసక్తి కలిగిన జశ్వంత్ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు,పాఠశాల ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు జశ్వంత్ కు అభినందనలు తెలిపారు.


