ఒకప్పుడు ‘ఉదయం’, ‘వార్త’ల్లో ప్రత్యేక గుర్తింపు.. నేడు మెదక్ వీధుల్లో దీనస్థితి
మూడు దశాబ్దాలుగా మానసిక అనారోగ్యంతో పోరాటం.. వైద్యం, పునరావాసం కోసం ఎదురుచూపు
మెదక్,ఆగస్టు 23(నమస్తే న్యూస్ డెస్క్):
ఒకప్పుడు చేతిలో కలం.. జేబులో నోట్‌బుక్.. వార్త కోసం పట్టణమంతా తిరిగే పాత్రికేయుడు. తన అక్షరాలతో ప్రజా సమస్యలకు గళం వినిపించిన వ్యక్తి. ప్రకృతి అందాలను కళ్లకు కట్టినట్లు వర్ణించిన రచయిత. అవినీతిపై పదునైన కథనాలతో అధికారులను ప్రశ్నించిన జర్నలిస్టు. కానీ కాలం మారింది. పరిస్థితులు తారుమారయ్యాయి. అదే చేతిలో నేడు పాత కాగితాలు.. పెదవుల మధ్య బీడీ.. ఒంటిపై మాసిన దుస్తులు.. మెదక్ వీధుల్లో అనాథలా తిరుగుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఆయనే బోనాల రమేష్.
ఒకప్పుడు ‘ఉదయం’, ‘వార్త’ దినపత్రికల్లో మెదక్ పట్టణ ప్రతినిధిగా పనిచేసిన రమేష్.. తన ప్రత్యేకమైన రచనా శైలితో గుర్తింపు పొందారు. ఆయన రాసిన వార్తలను నాటి జర్నలిస్టులు, న్యూస్ ఎడిటర్లు ప్రత్యేకంగా ప్రశంసించేవారని సహచరులు గుర్తుచేస్తున్నారు.
అక్షరాలకు ప్రత్యేక శైలి
కంప్యూటర్లు, వాట్సాప్ ప్రెస్నోట్లు లేని రోజుల్లో సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం సేకరించడం, సంబంధిత వ్యక్తులతో మాట్లాడటం, వాస్తవాలను నిర్ధారించుకుని వార్త రాయడం ఆనాటి జర్నలిజం పద్ధతి. ఆ కాలంలో రమేష్ రాసిన స్క్రిప్ట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేదని ఆయన సమకాలీనులు చెబుతున్నారు.
పదాల ఎంపిక, భాషా శైలి, అక్షర దోషాలు లేకుండా వార్తను తీర్చిదిద్దడంలో ఆయనకు మంచి పట్టు ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన స్క్రిప్ట్‌ను చూసి వార్త రాయడం నేర్చుకున్న జర్నలిస్టులు కూడా ఉన్నారని చెబుతున్నారు.
ప్రకృతిని అక్షరాల్లో చూపించిన కలం
ప్రకృతి, అడవులు, చెట్లు, కొండలు, వాగులు, పక్షులు, వన్యప్రాణులపై రమేష్ రాసిన కథనాలకు ప్రత్యేక ఆదరణ ఉండేదని సహచరులు చెబుతున్నారు. ప్రకృతి దృశ్యాలను కేవలం సమాచారంగా కాకుండా పాఠకుల కళ్లముందు సజీవంగా నిలిచేలా వర్ణించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉండేదని గుర్తుచేస్తున్నారు.
అదే సమయంలో అవినీతి, అక్రమాలపై ఆయన కలం పదునుగా ఉండేదని చెబుతున్నారు. తప్పు ఎక్కడ కనిపించినా ప్రశ్నించడంలో వెనుకాడేవారు కాదని నాటి పాత్రికేయులు గుర్తుచేసుకుంటున్నారు.
మూడు దశాబ్దాలుగా అనారోగ్యంతో పోరాటం
జర్నలిజంలో మంచి పేరు సంపాదించిన రమేష్‌ను తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు తమ శక్తిమేరకు చికిత్స చేయించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో పలుమార్లు చికిత్స పొందినట్లు సమాచారం.
అయితే నిరంతర వైద్యం, మందులు, పర్యవేక్షణ, పునరావాసం అవసరమైన పరిస్థితుల్లో చికిత్స కొనసాగకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని తెలిసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యం కారణంగా వృత్తికి దూరమైన రమేష్ కుటుంబ జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. భార్య దూరం కావడంతో ప్రస్తుతం మెదక్ పట్టణ వీధులే ఆయనకు ఆశ్రయంగా మారాయి.
కోవిడ్‌ను జయించినా.. జీవితాన్ని గెలిపించేది ఎవరు?
కరోనా మహమ్మారి సమయంలోనూ రమేష్ కోవిడ్‌ను తట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రస్తుతం సరైన వైద్యం, పర్యవేక్షణ, సురక్షిత వసతి లేకుండా వీధుల్లో తిరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
ఒకప్పుడు ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు.. నేడు తన సమస్యను చెప్పుకునే స్థితిలో లేకపోవడం విషాదకరం.
2015లోనూ ఇదే విజ్ఞప్తి.. 2026లోనూ మారని పరిస్థితి
రమేష్ దీనస్థితిపై 2015లోనే ఆయనను ఆదుకోవాలని, ప్రాణాలను కాపాడాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత పదకొండేళ్లు గడిచాయి. ప్రభుత్వాలు మారాయి. అధికారులు మారారు. జర్నలిస్టు సంఘాల నాయకత్వాలు మారాయి. మెదక్ పట్టణం రూపురేఖలు మారాయి. జర్నలిజం కూడా మారిపోయింది.
కానీ రమేష్ జీవితం మాత్రం మారలేదు.
2015లో లేవనెత్తిన ప్రశ్ననే 2026లోనూ మళ్లీ లేవనెత్తాల్సిన పరిస్థితి నెలకొంది.
భిక్ష కాదు.. వైద్యం కావాలి
రమేష్‌కు ఎవరైనా డబ్బు ఇవ్వొచ్చు. ఒకపూట భోజనం పెట్టొచ్చు. అది ఆ రోజు ఆకలి తీర్చవచ్చు. కానీ ఆయన సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.
రమేష్‌కు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. అవసరమైన మందులు, నిరంతర సంరక్షణతో పాటు సురక్షిత వసతి, పోషకాహారం, పునరావాసం కల్పించాలి. అర్హత ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడాలి.
జిల్లా యంత్రాంగం చొరవ చూపాలి
మెదక్ జిల్లా యంత్రాంగం ఈ అంశాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో రమేష్ ఆరోగ్య పరిస్థితిని నిపుణులతో పరీక్షించి, ఆయనకు అవసరమైన చికిత్స, పునరావాసంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని అవమానించడం లేదా బలవంతం చేయడం కాకుండా గౌరవంతో, వైద్యపరమైన విధానంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సహచరుడి చేయి పట్టాలి
జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై పోరాడే పాత్రికేయ సంఘాలు.. నిన్న తమతో కలిసి వార్తల కోసం తిరిగిన సహచరుడి పరిస్థితిపైనా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు అంటున్నారు.
ఒక్కరోజు ఆర్థిక సాయం చేయడం కంటే.. రమేష్‌కు చికిత్స ప్రారంభమై, సురక్షితమైన ఆశ్రయం ఏర్పడి, నిరంతర సంరక్షణ అందే వరకు జర్నలిస్టు సంఘాలు అండగా నిలవాలని కోరుతున్నారు.
సమాజం స్పందించాల్సిన సమయం
ఒకప్పుడు ప్రజల కోసం కలం పట్టిన జర్నలిస్టు.. నేడు అదే ప్రజల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి రావడం సమాజానికి ఒక హెచ్చరిక.
ఇతరుల కన్నీళ్లకు అక్షరరూపం ఇచ్చిన రమేష్ కన్నీళ్లను తుడిచేది ఎవరు?
ప్రభుత్వమా?
జర్నలిస్టు సంఘాలా?
ప్రజాప్రతినిధులా?
స్వచ్ఛంద సంస్థలా?
సమాజమా?
ఎవరైనా సరే.. ఇక ఆలస్యం చేయకుండా స్పందించాల్సిన అవసరం ఉంది.
రమేష్‌కు భిక్ష కాదు.. వైద్యం కావాలి.
వీధి జీవితం కాదు.. పునరావాసం కావాలి.
దయ కాదు.. గౌరవప్రదమైన జీవితం కావాలి.
అక్షరాలను శిల్పంలా చెక్కిన ఆ చేతికి.. ఇప్పుడు సమాజం అండగా నిలవాలి.
– డి.వై. గిరి
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాజకీయ–సామాజిక విశ్లేషకులు

