షోయాబుల్లాఖాన్ స్ఫూర్తితో సుబ్లేడు నుంచి పోరాట పయనం
ఇండ్ల స్థలాలు సాధించేవరకూ పోరాటం
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్ట్ 22 ( నమస్తే న్యూస్)
ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి నిత్యం అక్షరాలతో పోరాడే జర్నలిస్టులు.. తమ న్యాయమైన హక్కుల కోసం తొలిసారి రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్-2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. జర్నలిస్టుల హక్కుల కోసం సాగుతున్న ఈ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయే ఉద్యమంగా మారుతుందని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
షోయాబుల్లాఖాన్ అడుగుజాడల్లో జర్నలిస్టుల హక్కుల బాటలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలంతో పోరాడి, రజాకారుల చేతుల్లో పాశవికంగా హతమైన తొలితరం జర్నలిస్టు షోయాబుల్లాఖాన్ జన్మస్థలమైన సుబ్లేడు గ్రామం నుంచి ఈ చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జర్నలిస్టులు పాదయాత్రను ప్రారంభించారు. ప్రజల గొంతుకగా నిలిచిన షోయాబుల్లాఖాన్ స్ఫూర్తితో.. నేటి జర్నలిస్టుల హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటం అక్షరానికి ఉన్న శక్తిని మరోసారి చాటిచెబుతోందని నాయకులు పేర్కొన్నారు.
అడుగడుగునా ప్రజల హారతులు....
రాజకీయ,ప్రజా సంఘాల సంఘీభావం
జర్నలిస్టుల పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. కోలాటాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి అడుగడుగునా జర్నలిస్టులకు బ్రహ్మరథం పట్టారు. ఘనంగా స్వాగతించారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టులు తమ సమస్యల కోసం రోడ్డెక్కడం బాధాకరమని, వారి న్యాయమైన పోరాటానికి అండగా నిలుస్తామని వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయం
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ పాదయాత్ర తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుందని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు పేర్కొన్నారు. భారతదేశంలో ఒడిశాలో తొలిసారి జర్నలిస్టులు హక్కుల కోసం పాదయాత్ర చేపట్టిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, అదే స్ఫూర్తితో తెలంగాణలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
హామీ కాదు.. హక్కుగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల హామీని ఇక ఆలస్యం చేయకుండా అమలు చేయాలని వారు కోరారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులకు సొంత ఇంటి కల కూడా నెరవేరకపోవడం ఆవేదనకరమన్నారు. ఎన్నో కుటుంబాల కన్నీళ్లను వార్తలుగా మార్చే జర్నలిస్టుల జీవితాల్లోనూ ఒక వెలుగు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇండ్ల స్థలాలు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు.. జర్నలిస్టుల హక్కు సాధించే వరకు ప్రతి అడుగు ముందుకే” అని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.ప్రతి జర్నలిస్టు అడుగు కలపాలి.. ప్రభుత్వం స్పందించాలన్నారు. ఇది ఒక్క సంఘం పోరాటం కాదని.. ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి జర్నలిస్టు కుటుంబం యొక్క ఆకాంక్ష అని వారు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి జర్నలిస్టు ఈ పాదయాత్రలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఒకరి అడుగు మరొకరికి బలంగా మారాలని, జర్నలిస్టుల ఐక్యతే ప్రభుత్వంపై న్యాయమైన ఒత్తిడిని పెంచుతుందని అన్నారు. జర్నలిస్టుల పాదయాత్రకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు, మహిళలు, ప్రజలకు టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గొంతుకగా నిలిచే జర్నలిస్టుల గొంతును ప్రభుత్వం కూడా ఆలకించి, ఇచ్చిన హామీని అమలు చేస్తూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు పారుపల్లి కృష్ణారావు, జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, జిల్లా కమిటీ సభ్యులు నాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, పెండ్ర అంజయ్య, ఎన్.డి కర్ణ, దగ్గుపాటి మాధవరావు, టిడబ్ల్యూజేఎఫ్ మండల నాయకులు పోలేపొంగు నాగరాజు,భూక్య రాజేష్,రాథోడ్ కమల్ల వీరయ్య నవిలే బాబు, గాదరి వెంకన్న, స్థానిక సర్పంచ్ సంఘబత్తుల స్వాతి-సుమన్ రెడ్డి, తిరుమలాయపాలెం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పసలాది సత్యనారాయణ, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ రెడ్డి, తకెళ్లపల్లి నరేందర్ రావు, బొడ్డుపల్లి నాగప్రసాద్, నల్లగట్టు శ్రీనివాస్, సిపి(ఐ)ఎం రాష్ట్ర నాయకులు బండి రమేష్, బషీరుద్దీన్ కొమ్ము శ్రీను, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజపంథా నాయకులు కమ్మకోమటి నాగేశ్వరరావు, తిమ్మిడి హన్మంతరావు, సీపీఐ ఎంఎల్ న్యూ డేమోక్రసి నాయకులు గొర్రెపాటి రమేష్, బీఎస్పీ ఎన్నబోయిన రమేష్,యాదవ్ నల్లగట్టు శంకర్, సీఐటీయూ మండల నాయకులు వశపోంగు వీరన్న, ఎంఆర్పీఎస్ నాయకులు చింతరాల నాగభూషణం, టిజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.





