ప్రభుత్వ నిరాదరణపై జర్నలిస్టుల శరఘాతాలు!
అధికారులకు వినతిపత్రాల వెల్లువ.. ప్రత్యేక ‘జర్నలిస్ట్ కాలనీ’కై డిమాండ్!
ప్రతి జర్నలిస్టుకు 200 గజాల స్థలం ఇచ్చే వరకు పోరాటం ఆపబోం
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం ,ఆగస్టు 22 (నమస్తే న్యూస్)
సమాజ శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కలం పట్టి శ్రమిస్తున్న జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని యూనిటీ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం తిరుమలయపాలెం మండల కేంద్రంలో జర్నలిస్టులు ఏకమై తమ దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసిల్దార్ లూధర్ విల్సన్, ఎంపీడీవో షేక్ షీలార్ సాహెబ్ కు జర్నలిస్టులంతా కలిసి వినతిపత్రాలను అందజేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా తమ గళాన్ని విప్పారు.
సమాజ సేవకులకు నిలువ నీడ లేకపోవడం ప్రభుత్వానికే అవమానం!
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ నాయకులు ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే సీనియర్ జర్నలిస్టుల జీవితాలకు భద్రత కల్పిస్తూ వృద్ధాప్య పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తిరుమలయపాలెం మండల పరిధిలోని గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించేందుకు తక్షణమేప్రత్యేక కాలనీ ఏర్పాటు: మండలంలో అనువైన ప్రభుత్వ భూమిని సేకరించి, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక కాలనీని నిర్మించాలి. 200 గజాల హక్కు: అర్హుడైన ప్రతి జర్నలిస్టుకు 200 గజాల ఇళ్ల స్థలాన్ని ఉచితంగా కేటాయించి, ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలి.ప్రభుత్వ మొండివైఖరిని ఎండగడుతూ జరిగిన ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు జిల్లా నాయకులు పప్పుల శ్రీనివాసరావు, ఉబ్బని సుందర్, మేకల రాజు కూరపాటి విజయ్, గోవింద సురేష్, బోడపట్ల సతీష్, గుజ్జు రామకృష్ణ గొర్రె పాటి శ్రీశైలం, గాదరి బాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కదంతొక్కారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు.

