రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 22: (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్మార్ట్ న్యూ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేశారు. స్మార్ట్ కార్డులు పొందిన కొందరు గ్రామ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త కార్డుల్లో కార్డు నంబరు, యజమాని పేరు తప్ప ఎలాంటి సమాచారం లేదని, పాత రేషన్ కార్డులే వీటికంటే అద్భుతంగా ఉండేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తిరుమలాయపాలెం మండల నాయకులు చామకూరి సునీల్ చిట్టి మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కిలో బియ్యం రెండు రూపాయలకే, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కిలో బియ్యం ఒక రూపాయికే (కుటుంబంలో ఒక్కో సభ్యునికి 6 కిలోల చొప్పున) అందించినా ఎప్పుడూ రేషన్ కార్డులపై తమ ఫోటోలు వేసుకోలేదని అన్నారు. కేవలం ఫోటోల కోసమే స్మార్ట్ కార్డుల పేరుతో రాష్ట్ర ఖజానాపై రూ.30 కోట్లకు పైగా అదనపు భారం మోపుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ పాలనను మర్చిపోతున్నారనే స్వార్థపూరిత ఆలోచనతో ప్రింటింగ్ కోసం కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శించారు.

