జిల్లా అధికారిని అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు
DCO గారికి మధుకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
నిజాయితీగా విధులు నిర్వహిస్తే రాజకీయ బంధాలా?
మధుకర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎమ్మార్పీఎస్, మాలమహానాడు,దళిత సంఘాలు
రిపోర్టర్: పిల్లల, మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
జిల్లా సహకార సంఘంలో నీతి నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న దళిత మహిళా అధికారిపై రాజకీయపరమైన ఆరోపణలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొతపేట-గంధపల్లి గ్రామంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ తన విధులను బాధ్యతగా నిర్వహిస్తున్న అధికారిపై వ్యక్తిగత, రాజకీయ కక్షతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారి తన విధులను నిబంధనల ప్రకారం నిర్వహిస్తే, అందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని, దళిత మహిళా అధికారిని పట్టుకుని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఒక అధికారి తన విధులను నిబంధనల ప్రకారం నిర్వర్తిస్తుంటే, ఆమెను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని రాజకీయ బంధాలుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని.? అంతేకాదు రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా మీ రెడ్డి సామాజిక మహిళ అధికారులంతా పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు వారు కూడా రాజకీయ నాయకులతో ఫెవికాల్ బంధాలు పెట్టుకొనే విధులు నిర్వహిస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఆరోపణలు ఉంటే ఆధారాలతో మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రాజకీయాలు శాశ్వతం కాదని, ప్రజలకు నిజాయితీగా సేవలందించే అధికారులు మాత్రం వ్యవస్థకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక మహిళా అధికారిని, అందులోనూ దళిత అధికారిని అవమానించేలా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో దళిత అధికారులు, మహిళా అధికారులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ వేధింపులు పునరావృతం కాకుండా జిల్లా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మధుకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, DCO గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సంగేపొంగు శ్రీను, బైగాళ్ల వీరబాబు, కాస్తల నవీన్, పుల్లూరి సుధాకర్, చెరుకుపల్లి గోపి, పందుల తేజ, మంచాల నాగరాజు, అంచపల్లి రవి, బొడ్డు నర్సయ్య,ఇనుపనూరి రాములు, ఇర్రి ప్రేమ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

