సీతారామ ప్రాజెక్టు కాల్వల ముంపులో 20 దళిత కుటుంబాల సాగుభూమి
50 ఏళ్ల నాటి హక్కు.. కేసీఆర్ సర్కార్ పట్టాలున్నా తప్పని తిప్పలు
పరిష్కారం కోసం కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించిన తహశీల్దార్
రిపోర్టర్ :దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ,ఆగస్టు 23 (నమస్తే న్యూస్)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ఆ గ్రామంలోని దళిత కుటుంబాల జీవితాల్లో మాత్రం చీకట్లు నింపింది. ప్రాజెక్టు కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ గత ఇరవై ఏళ్లుగా ఆ పేదలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు మాత్రం నిర్దాక్షిణ్యంగా ‘ఇది ప్రభుత్వ భూమి.. పరిహారం రాదు’ అని తేల్చిచేబుతున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండల పరిధిలోని తిప్పారెడ్డిగూడెం గ్రామంలో దళితులకు జరిగిన తీవ్ర అన్యాయంపై ఒక ప్రత్యేక వార్తా కథనం.
50 ఏళ్ల నాటి హక్కు.. కేసీఆర్ సర్కార్ పట్టాలు!
గ్రామంలోని 20 ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలకు 1976లోనే ప్రభుత్వం వ్యవసాయం నిమిత్తం సర్వే నెంబర్ 148లో భూములను కేటాయించింది. అయితే, అదే సర్వే నెంబర్లో గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణాల (కమ్మ) వ్యక్తుల పేరిట కూడా రికార్డులు ఉండటాన్ని గమనించిన దళితులు నాడే అధికారులను నిలదీశారు. దీంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం, దళితుల హక్కులను గుర్తిస్తూ వారికి ‘పీడీ’ (P.D) రూపంలో పత్రాలను అందజేసింది. ఆ తర్వాత 2018లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీరికి పూర్తిస్థాయిలో పక్కా పట్టా దార్ పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు.
ప్రాజెక్టు తెచ్చిన ముంపు.. అధికారుల తిరస్కరణ
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు కాల్వలు సరిగ్గా ఈ 20 దళిత కుటుంబాల భూముల గుండానే వెళ్లాయి. దీంతో సాగుభూమిని కోల్పోయిన బాధితులు.. తమకు రావలసిన నష్టపరిహారం కోసం 2000 సంవత్సరం నుండి నేటి వరకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే, “ఇది ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూమి.. కాబట్టి దీనిని ప్రభుత్వమే తిరిగి తీసుకుంటుంది తప్ప నష్టపరిహారం ఇవ్వడం కుదరదు” అని అధికారులు ఉల్టా సమాధానం చెబుతుండటంతో ఆ పేదలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమాయకత్వమే శాపమా, రాజకీయం తెలియకపోవడమే నేరమా అని తిప్పారెడ్డిగూడెం దళిత గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించిన తహశీల్దార్
ఈ సుదీర్ఘ భూ సమస్యపై స్థానిక తహశీల్దార్ ( తహసిల్దార్) లూధర్ విల్సన్‌ను వివరణ కోరగా, ఆయన సున్నితంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ సమస్య చాలా పాతది కావడంతో పాటు నా పరిధిలో లేదు. పైగా నేను ఈ మధ్యకాలంలోనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. అందువల్ల మీరు ఈ విషయమై నేరుగా జిల్లా కలెక్టర్ ని కలిసి మాట్లాడితే సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది” అని బాధితులకు తగిన సలహా ఇచ్చారు.
తిరుమలయపాలెం ఎమ్మార్పీఎస్ తీవ్ర ఆగ్రహం.. మందకృష్ణ మాదిగ హామీ!
అధికారుల మొండివైఖరిపై తిరుమలయపాలెం ఎమ్మార్పీఎస్ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గోవింద సురేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిించిరాల నాగభూషణం ఈ విషయంపై చాలా తీవ్రంగా ఖండిస్తూ.. బాధితులకు అండగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. దళితుల భూములను అన్యాయంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని, పేద దళితులకు న్యాయమైన నష్టపరిహారం అందే వరకు ఎమ్మార్పీఎస్ ఎల్లవేళలా తోడుగా ఉండి పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, దశాబ్దాలుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్న తిప్పారెడ్డిగూడెం దళితులకు సీతారామ ప్రాజెక్టు నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

