డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 23(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలోని పలు వార్డులలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు, అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న మంచినీటి పైప్ లైన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరును, చెత్త సేకరణ, డ్రైనేజీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం వహించవద్దని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అమృత్ పథకం కింద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోతు సురేష్, మున్సిపల్ అధికారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


