డోర్నకల్,మరిపెడ,ఆగస్టు 23(నమస్తే న్యూస్).
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి,ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపులకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో రైతుబంధు,రైతుబీమా వంటి పథకాలను తీసుకొచ్చి రైతును రాజుగా నిలబెట్టారని,కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు చనిపోయినా రైతుబీమా అందని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మరిపెడ మండలం వెంకంపాడు గ్రామ యువ సర్పంచ్ ఉప్పల సోమన్న ప్రమాదంలో మృతి చెందారని,ఆయన కుటుంబానికి రెండెకరాల భూమి ఉన్నప్పటికీ రైతుబీమా అందకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.రైతు చనిపోయాడు..కుటుంబం రోడ్డున పడింది..అయినా ప్రభుత్వం కదలడం లేదు.ఇదేనా కాంగ్రెస్ చెప్పుకున్న ప్రజాపాలన?అని ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతూ..దమ్ముంటే కొండా సుస్మిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి బిడ్డ మాట్లాడుతున్నా సమాధానం చెప్పలేని స్థితిలో ఎందుకు ఉన్నారు? అని నిలదీశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న రైతుబీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం,ప్రజా సమస్యలను పక్కనపెట్టి వాటాల పంపిణీపై చూపుతున్న శ్రద్ధను పాలనపై చూపడం లేదని ఎద్దేవా చేశారు.కేసీఆర్ సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టినప్పుడు లంకెబిందెలు దొరికాయని అర్థం పర్థం లేని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చినా రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతోంది,మాటలు తప్ప చేతల్లో ఏమీ లేదు అని అన్నారు.కళ్యాణలక్ష్మి వంటి పథకాల ప్రయోజనాలు సకాలంలో అందక పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పిన మాట ఇప్పుడు అక్షరాలా నిజమైంది..మోసపోతే గోస పడతామని.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, పేదల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.తెలంగాణ ప్రజలకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని,కేసీఆర్ తోనే తెలంగాణలో నిజమైన ప్రజా సంక్షేమ పాలన,రైతు రాజ్యం,రామరాజ్యం సాధ్యమవుతుందని,ప్రజల ఆశీర్వాదంతో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.

