తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దు:ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 22(నమస్తే న్యూస్).తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగు చేయవద్దని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సూచించారు.మరిపెడ మండల కేంద్రంలోని ఏడీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆత్మ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీరు తీసుకునే పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలన్నారు. సాంప్రదాయ వరి సాగును తగ్గించుకుని పప్పు ధాన్యాలు,చిరుధాన్యాలు,నూనె గింజల పంటలతో పాటు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.సాగులో సాంకేతిక మెలకువలు పాటించి అధిక లాభాలు పొందాలని,అధిక మోతాదులో రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
రైతులకు అవగాహన కల్పించేందుకు ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఆయా మండల కేంద్రాల్లో నిపుణులచే శిక్షణ తరగతులు,వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ సంచాలకులు మురళి,టెక్నికల్ ఏవో శ్రీదేవి,ఆత్మ కమిటీ సభ్యులు,వివిధ మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

