పాల్గొన్న తహసీల్దార్ రమేష్ బాబు, సర్పంచి భూక్య సోనియా హరిలాల్
నర్సింహులపేట, ఆగస్టు 22 (నమస్తే న్యూస్)
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరకులను లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా అందించవచ్చని తహసీల్దార్ రమేష్ బాబు, పెద్దనాగారం స్టేజీ గ్రామ సర్పంచి భూక్య సోనియా అన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో భాగంగా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే వినియోగదారుడి పూర్తి వివరాలతో పాటు అతనికి కేటాయించిన బియ్యం కోటా వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. దీంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరిగి, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో సరకులు అందే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తండ మౌనిక, ఉప సర్పంచి రవిబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొబ్బ సోమిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, గ్రామస్థులు హరిలాల్, అనిల్, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.

