విద్యార్థులతో కలిసి భోజనం.. వసతులపై ఆరా
రాత్రివేళ విద్యార్థులు బయటకు వెళ్లడంపై ఆగ్రహం
ఇల్లందు, ఆగస్టు 22 (నమస్తే న్యూస్ డెస్క్): ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం ఏహెచ్ఎస్ హాస్టల్‌ను ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, విద్యాబోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాస్టల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ప్రాంతాలను, వంటగది పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన మెనూ, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
మౌలిక వసతులు కల్పిస్తా.. ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ
హాస్టల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. త్వరలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఇటీవల రాత్రివేళ హాస్టల్ నుంచి కొందరు విద్యార్థులు బయటకు వెళ్లిన ఘటనపై ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. విద్యార్థుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్టల్లో విద్యార్థులకు అందాల్సిన మౌలిక వసతులు, విద్యాబోధనలో ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకున్నా ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విద్యార్థుల భద్రత, విద్య, వసతుల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఎమ్మెల్యే వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఇల్లందు సొసైటీ చైర్మన్ మెట్ల రామకృష్ణ, బొజ్జాయిగూడెం ఉపసర్పంచ్ అరెం కిరణ్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మూగల మల్లేష్, గౌతమ్ రాజ్ తదితరులు ఉన్నారు.



