రెండు రోజుల్లో రెండు ఘటనలు..!
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై విమర్శలు
50 మందికిపైగా విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు తప్పిన ప్రమాదం

తొర్రూరు, ఆగస్టు 22 (నమస్తే న్యూస్): పాఠశాల విద్యార్థుల భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వరుసగా రెండు రోజుల వ్యవధిలో రెండు స్కూల్ బస్సులు ప్రమాదాల బారిన పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన స్కూల్ యాజమాన్యాలు, బస్సు నిర్వాహకులు నిబంధనలను పాటిస్తున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.శుక్రవారం (21న) ఓ స్కూల్ బస్సు వెనుక టైరు ఊడిపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన మరువకముందే శనివారం తొర్రూరులోని సెయింట్ ఫాల్స్ స్కూల్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 50 మందికిపైగా విద్యార్థులతో వెళ్తున్న బస్సు రోడ్డు దాటుతున్న సమయంలో రెండు లారీలు ఢీకొన్నట్లు సమాచారం. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.అధికారుల తనిఖీలు ఎక్కడ?స్కూల్ బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల అర్హతలు, వాహనాల నిర్వహణ, వేగ నియంత్రణపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ.. వరుస ఘటనలు జరుగుతున్నా తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బస్సు డ్రైవర్ ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలా?స్కూల్ బస్సుల్లో చిన్నపాటి లోపాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తొర్రూరు పట్టణంలో నడుస్తున్న అన్ని స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు, వేగ నియంత్రణ, భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
o


