హత్యకు ఉపయోగించిన కర్రలు, రాళ్లు స్వాధీనం
కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందానికి డీఎస్పీ అభినందనలు
వివరాలు వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్
తొర్రూరు, ఆగస్టు 21 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో బుధవారం జరిగిన గుంటుక రమేష్ హత్య కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తొర్రూరు సీఐ గణేష్ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, గురువారం వారిని మీడియా ముందు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ, ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి మృతి చెందగా నిర్వహించిన ఐదో రోజు కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘర్షణ నేపథ్యంలో గుంటుక రమేష్‌పై నిందితులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు.దాడి నుంచి తప్పించుకునేందుకు రమేష్ చెరువు వైపు పరుగెత్తగా, నిందితులు అతడిని వెంబడించి మరోసారి దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు ఉపయోగించిన కర్రలు, రాళ్లను స్వాధీనం చేసుకున్నామని, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.వ్యక్తిగత లేదా సామాజిక వివాదాలను హింసకు దారితీయకుండా ప్రజలు సంయమనం పాటించాలని డీఎస్పీ సూచించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, నిబంధనలు అతిక్రమించి హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.హత్య కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన తొర్రూరు సీఐ గణేష్, ఎస్ఐ మహేందర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ కృష్ణ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.


