30 మంది చిన్నారులతో వెళ్తున్న బస్సు వెనుక టైరు ఊడిన ఘటన.
పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
రవాణా, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణపై ప్రజల విమర్శలు.
తొర్రూర్, ఆగస్టు 21 (నమస్తే న్యూస్)
బస్సులో చిన్నారులు ఉండగానే టైరు ఊడిపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే, 30 మంది చిన్నారులను తరలిస్తున్న బస్సు టైరు ఎలా ఊడిపోయింది? వాహనం ఫిట్నెస్ను అధికారులు ఎప్పుడు తనిఖీ చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, డ్రైవర్ల లైసెన్సులు, టైర్లు, బ్రేకులు వంటి భద్రతా ప్రమాణాలపై రవాణా, విద్యాశాఖ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు కాకుండా, మరో ప్రమాదం జరగకముందే ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం జరిగితే బాధ్యత ఎవరిది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

