కాపాడాల్సిన సర్పంచే ఇబ్బందులు పెడితే కాపాడేది ఎవరు..?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెచ్చుకున్న ఇసుకను సీజ్ చేయించారంటూ గ్రామస్తుల ఆవేదన
తొర్రూర్, ఆగస్టు 21 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కర్కాల గ్రామంలో గ్రామ సర్పంచ్ తీరుపై కొందరు గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెచ్చుకున్న ఇసుకను అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించారని వారు ఆరోపిస్తున్నారు.గ్రామంలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నిర్మించుకునేందుకు గ్రామస్తులు దశలవారీగా ఇసుకను తరలించి ఇళ్ల ముందు నిల్వ చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇళ్ల నిర్మాణం కోసం తెచ్చుకున్న ఇసుకను గ్రామ సర్పంచ్ అధికారులకు సమాచారం అందించి సీజ్ చేయించారని వారు ఆరోపించారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.గ్రామంలో సుమారు 18 మంది ట్రాక్టర్ యజమానుల వద్ద ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేల చొప్పున డబ్బులు తీసుకుని, గ్రామస్తులకు అవసరమైన మేర ఇసుకను తరలించుకోవచ్చని, ఇందుకు తమకు అనుమతి ఉందని చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము డబ్బులు చెల్లించి ఇసుకను తెప్పించుకున్నామని, అనంతరం అదే ఇసుకను అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంటే, ఇళ్ల నిర్మాణానికి అత్యవసరమైన ఇసుక విషయంలోనే ఇబ్బందులు కల్పించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తుంటే, మరోవైపు ఇసుక కొరత, సీజ్ చర్యలతో పేదలు తమ ఇళ్ల నిర్మాణ పనులను కొనసాగించలేకపోతున్నారని వాపోతున్నారు.“పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధే ఇబ్బందులు కల్పిస్తే తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి?” అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కర్కాల గ్రామస్తులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను తరలించుకునే పేద ప్రజలకు స్పష్టమైన మార్గదర్శకాలు, అవసరమైన అనుమతులు కల్పించి అనవసర ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇసుక విషయంలో వసూళ్లకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కూడా అధికారులు విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక అడ్డంకిగా మారకుండా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

