రామన్నపేట కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన
ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి
రామన్నపేట ఆగస్ట్ 21( నమస్తే న్యూస్)
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు,
రామన్నపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మనన్ కుమార్ మిశ్రా పద్నాలుగు సంవత్సరాలకు పైగా బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతూ, చట్టబద్ధమైన ప్రజాస్వామిక సంస్థలో అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం అభ్యంతరకరమన్నారు. బీసీఐ ఏ రాజకీయ పార్టీకి లేదా ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. బీసీఐ అధికారిక పదవిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సంస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీస్తుందని విమర్శించారు,
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఏకపక్షమైన, చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు, కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా అభిప్రాయం వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్‌ను శిక్షించడం రాజ్యాంగ విలువలకు, న్యాయవాదుల చట్టం–1961కు విరుద్ధమన్నారు, ఆదేశాలను అనంతరం ఉపసంహరించుకున్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత నుంచి చైర్మన్ తప్పించుకోలేరన్నారు.
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వతంత్రతలో జోక్యం చేసుకోవడం, ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను నామినేషన్ల ద్వారా అధికార స్థానాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమన్నారు. న్యాయవిద్య ప్రమాణాలు, న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బీసీఐ కోల్పోయిన గౌరవం, విశ్వసనీయత, ప్రజాస్వామిక స్వభావాన్ని పునరుద్ధరించేందుకు మనన్ కుమార్ మిశ్రా వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఐలు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగతయ్య, జిల్లా కమిటీ సభ్యులు యాదాసు యాదయ్య, గడ్డం నరసింహ, వీరమల్ల నర్సింహ, అంతటి రమేష్, అంకం నరేష్ ,బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

