సీపీఎం పాదయాత్రను జయప్రదం చేయాలి జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్
రామన్నపేట ఆగస్ట్ 20( నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ వరకు నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు.పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను రామన్నపేటలో సీపీఎం నాయకులతో కలిసి ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి దశాబ్దం పూర్తవుతున్నప్పటికీ జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, లక్షలాది మంది చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరో గత్యంతరం లేక మూసీ నది కలుషిత నీటిని పంటలకు వినియోగిస్తూ భూములు, పంటలు కలుషితం కావడంతో పాటు ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు ప్రజల గోడు పట్టించుకోకుండా తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. జిల్లాకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలకమైన బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.రామన్నపేట ప్రాంతానికి ఎంతో కీలకమైన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువల పనులు ఏళ్లు గడుస్తున్నా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా రామన్నపేట మండలానికి మూసీ నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను అందించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎంతో పురాతనమైన ఆసిఫ్‌నగర్ కాలువను పునరుద్ధరించాలని, అర్ధాంతరంగా నిలిచిపోయిన కాలువల పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి, కాలపరిమితితో పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ఇవ్వాలని, 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి ఇందిరాపార్క్ వరకు జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని ఎం.డి. జహంగీర్ కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్,మండల కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి నగేష్,మండల కమిటి సభ్యులు బావండ్లపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, తొలుపునూరి శ్రీనివాస్, అవనగంటి నగేష్, నీల అయిలయ్య,పల్లె సత్యం, దండిగ నర్సింహా,బావండ్లపల్లి సత్యం,శానగొండ వెంకటేశ్వర్లు,వళ్లమల్ల రమేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

