సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య
రామన్నపేట ఆగస్ట్ 20( నమస్తే న్యూస్ )
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ..రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోతున్నారని, మరోవైపు ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందడం లేదని అన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలపై శాఖల వారీగా సమగ్ర లెక్కలు వెల్లడించి, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు.ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, యువత చేస్తున్న పోరాటాలకు సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే నిరుద్యోగ యువతను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్,మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, కల్లూరి నగేష్,నాయకులు బావండ్లపల్లి బాలరాజు,నాగటి ఉపేందర్, అవనగంటి నగేష్, తోలుపునూరి శ్రీనివాస్, శానాగొండ రాము, మేడి ముకుంద, శానాగొండ వెంకటేశ్వర్లు,గోగు లింగస్వామి, దండిగ నర్సింహా, కరకంటి మల్లేష్, ఆకిటి మల్లేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

