రామన్నపేట, ఆగస్ట్ 20( నమస్తే న్యూస్ )
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానాట్యమండలి మాజీ జిల్లా అధ్యక్షులు, ప్రజా కళాకారులు కామ్రేడ్ కారుపోతుల అంజన్న 31వ వర్ధంతి సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కక్కిరేణి గ్రామంలో ఘనంగా నివాళులర్పించి, జోహార్లు అర్పించారు.ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు గంటెపాక శ్రీకృష్ణ,మండల అధ్యక్షులు బర్రె మధు మాట్లాడుతూ ప్రజా కళాకారుడిగా కారుపోతుల అంజన్న ప్రజా సమస్యలను తన కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు.సమాజంలోని అన్యాయాలు, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన కళను ఒక ఆయుధంగా ఉపయోగించారని పేర్కొన్నారు.“కళ కళ కోసం కాదు,కళ ప్రజల కోసం” అనే ఆశయంతో ప్రజల కోసం తన కళను అంకితం చేసిన అంజన్న సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.ప్రజా కళాకారులకు ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. నేటి కళాకారులు కూడా ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ సమాజ మార్పు కోసం తమ కళను వినియోగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు మజ్జూరి సాయి, రామన్నపేట మండల కమిటీ సభ్యులు కానుకుంట్ల ఉప్పలయ్య, మచ్చగిరి, వెంకన్న, లింగస్వామి, చరణ్, లోకేష్, బూడిద ఆది తదితరులు పాల్గొని కామ్రేడ్ కారుపోతుల అంజన్నకు ఘన నివాళులు అర్పించారు.
