గజ్వేల్, ఆగస్టు 19(నమస్తే న్యూస్ డెస్క్): టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ తల్లి బాషారత్ ఉన్నిసాబేగం అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో జర్నలిస్టు సంఘం నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన అంతిమయాత్రలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్. శ్రీనివాస్ పాల్గొని బాషారత్ ఉన్నిసాబేగం భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆవుల యుగేందర్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ వంశీ తదితరులు బాషారత్ ఉన్నిసాబేగం చిత్రపటానికి నివాళులర్పించారు. బాషారత్ ఉన్నిసాబేగం మృతి పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




