మహబూబాబాద్, ఆగస్టు 19(నమస్తే న్యూస్ డెస్క్)
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఈరోజు జిల్లా జడ్జి కె. మురళీ మోహన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, కోర్టు కేసుల పురోగతి, సాక్షుల హాజరు మరియు కేసుల్లో మెరుగైన కన్విక్షన్ సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం చర్చించారు.అనంతరం మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లాలోని సీడీఓలతో సమావేశం నిర్వహించి కేసుల దర్యాప్తు, పరిష్కారం, కోర్టు విచారణ మరియు శిక్షల సాధనకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల డిస్పోజల్, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా అవసరమైన ఆధారాలు, సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించి, కోర్టులో కేసు బలంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీడీఓలు తమ పరిధిలోని కేసుల దర్యాప్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, దర్యాప్తు అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని ఎస్పీ తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం కూడా కేసు కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరంతర ఫాలోఅప్ కొనసాగించాలని సూచించారు.సమావేశంలో కేసుల డిస్పోజల్స్, కేసుల కన్సంప్షన్, ICJS, డ్రంకెన్ డ్రైవ్ కేసులు, POCSO కేసులు, Cr.P.C. సెక్షన్ 164కు సంబంధించిన కేసులు, e-Summons తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.POCSO కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు. సెక్షన్ 164 కింద స్టేట్మెంట్లకు సంబంధించిన ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసి, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ICJSలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు, e-Summons వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కోర్టు కేసుల్లో సమన్లు, నోటీసులు సకాలంలో అమలయ్యేలా సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చట్టపరమైన ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతరం తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు కోర్టుల్లో శిక్షల శాతం పెంచడమే లక్ష్యంగా సీడీఓలు పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. సాక్షుల హాజరు, సాక్ష్యాధారాల సమర్పణ, సంబంధిత రికార్డుల నిర్వహణ, కోర్టు ప్రక్రియలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.ప్రతి కేసును బాధ్యతగా తీసుకుని, దర్యాప్తు ప్రారంభం నుంచి కోర్టులో తుది తీర్పు వచ్చే వరకు సమర్థవంతంగా ఫాలోఅప్ చేయడం ద్వారా బాధితులకు న్యాయం అందించడంతో పాటు, నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా చేయాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సీడీఓలను ఆదేశించారు.


