మూకుమ్మడిగా అధికారులకు వినతిపత్రాలు అందజేసిన గ్రామ ప్రజలు
సెప్టెంబర్ 1 నుంచి గ్రామ పరిధిలో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్
రామన్నపేట, ఆగస్టు 19 (నమస్తే న్యూస్ డెస్క్):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలను నిషేధించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, గ్రామ ప్రజల ఫిర్యాదుల మేరకు గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెల్లంకి గ్రామ పరిధిలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఈ తీర్మానానికి సంబంధించిన వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా ఎక్సైజ్ అధికారులు, మండల ఎక్సైజ్ అధికారులు, రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. బెల్టు షాపుల కారణంగా గ్రామంలో మద్యం విక్రయాలు పెరిగి యువతపై తీవ్ర ప్రభావం పడుతోందని, కుటుంబాలపై ఆర్థిక భారం పెరగడంతో పాటు గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో పాటు యువత భవిష్యత్తును కాపాడేందుకు బెల్టు షాపులను పూర్తిగా అరికట్టాలని అధికారులను కోరారు.సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వెల్లంకి గ్రామ పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తప్పవని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. గ్రామంలో బెల్టు షాపులకు తావులేకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, జువ్వగోని మల్లమ్మ, జింక శాంతి, మొగిలి భాగ్యలక్ష్మీ, గంజి భాస్కర్, కన్నెబోయిన రాజలింగం, అఖిలపక్ష నాయకులు పర్నే వెంకట్రెడ్డి, ఆవనగంటి నగేష్, పున్న వెంకటేశం, కర్రే సంతోష్, బర్ల బాబురావు, నకిరేకంటి మహేష్, తాటిపాముల లింగస్వామి, గూని రాజు, గూడెల్లి దామోదర్, నకిరేకంటి నరేందర్, పాశం సతీష్, నకిరేకంటి గణేష్, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.


