డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 19(నమస్తే న్యూస్).
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక క్రమశిక్షణ పాటించి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని మరిపెడ ఏపీఎం సీహెచ్ అలివేలు మంగ పిలుపునిచ్చారు.బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని శ్రీదుర్గ మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన 18వ వార్షిక మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మండల సమైక్య అధ్యక్షురాలు అజ్మీర్ వసంత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అలివేలు మంగ మాట్లాడుతూ,సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు.ఒక్కరు లేదా ఇద్దరు సభ్యులు రుణాలు చెల్లించకపోవడంతో మొత్తం సంఘం డిఫాల్టర్ గా మారే పరిస్థితి వస్తోందన్నారు.బకాయిలు లేని సంఘాలకే కొత్త రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
మహిళల ఆర్థిక స్వావలంబన,కుటుంబ ఆదాయ పెంపు,చిన్న వ్యాపారాలు,పాడి,కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ వడ్డీ రుణాలు,బ్యాంకు లింకేజీ,వడ్డీ రాయితీలు,వివిధ ఆర్థిక ప్రోత్సాహక పథకాలను అందిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సంఘాలకు సామర్థ్యాభివృద్ధి శిక్షణలు, ఆర్థిక నిర్వహణపై అవగాహన, బ్యాంకులతో సమన్వయం, జీవనోపాధి కార్యక్రమాలకు ప్రోత్సాహం,మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. సంఘాలు బలోపేతం కావడం ద్వారా మహిళల కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందన్నారు. ప్రతి నెల సంఘ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించి పొదుపు, రుణాల వినియోగం, తిరిగి చెల్లింపులపై సమీక్ష చేయాలని సూచించారు.ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కల్పిస్తున్న అవకాశాలను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల సమైక్య కార్యదర్శి మంజుల,కోశాధికారి కృష్ణవేణి, సీసీలు. మల్లేశం, జి.చందులాల్ ,ఈ.నరసయ్య ,బి.శ్రీను, బి.శ్రీరాములు, ఆఫీస్ ఆడిటర్ బి.రజిత ,ఏ.విజయ్ కుమార్ ,వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

