డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 19(నమస్తే న్యూస్).
పెన్షనర్లకు రావాల్సిన అన్ని బెనిఫిట్లను వెంటనే అందించాలని, నాణ్యమైన నగదు రహిత వైద్య సేవలు కల్పించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల అధ్యక్షుడు గాదె అశోక్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి కాయిత వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించిన నాలుగు విడతల డీఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.వాటిని తక్షణమే విడుదల చేయడంతో పాటు కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు.వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటున్నాయని, అయినప్పటికీ నగదు రహిత వైద్య సేవలు సక్రమంగా అందక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని,వాటికి సంబంధించిన ఏరియర్స్ ను కూడా క్లియర్ చేయాలని కోరారు.అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు 50 శాతం ప్రయాణ రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.పెన్షనర్లకు రావాల్సిన అన్ని బెనిఫిట్లను ఆలస్యం చేయకుండా అందించడం ప్రభుత్వ బాధ్యత అని,వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక,వైద్య ఇబ్బందులు లేకుండా సంక్షేమ చర్యలు చేపట్టాలని అన్నారు.పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సమావేశం తీర్మానించింది.ఈ కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి గోడిశాల వీరయ్య, జి.వెంకన్న, బాష్పంగు వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, రామ్మూర్తి, రాములు, ధర్మయ్య, షేక్ మదార్, బాల్యానాయక్, ప్రేమలత, ఆర్.కమల,జి.మణి తదితరులు పాల్గొన్నారు.

