బయ్యారం, ఆగస్టు 18(నమస్తే న్యూస్):
ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించనున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకుడు దొంతోజు ఉపేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బయ్యారం మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరిస్తోందని విమర్శించారు.నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, కార్మికులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రక్షణ రంగంలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు.సింగరేణి, ఎన్ఎండీసీ, ఆర్సీ, జెన్కో, రైల్వే, విద్యుత్, బ్యాంకింగ్, విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తోందన్నారు. విద్యుత్, రైల్వే, రక్షణ, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని కోరారు.అటవీ భూములు, ఖనిజాలు, గనులను దీర్ఘకాలిక లీజుల పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. యూనియన్లకు ప్రజాస్వామ్య హక్కులు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికోద్యమంలో పోరాడి అమరులైన కార్మికులకు నివాళులు అర్పిస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

