మండల అధికారుల అత్యుత్సాహం పై దుమ్మెత్తి పోస్తున్న బాధితులు
తల్లిదండ్రుల అభ్యంతరాలు బేఖాతరు.. రిజెక్ట్ ఫైల్‌కు మళ్లీ ఓపెన్!
ఫ్యామిలీ సర్టిఫికెట్‌పై వివాదం.. ఉన్నతాధికారుల విచారణకు బాధిత కుటుంబం డిమాండ్
నర్సింహులపేట,ఆగస్టు 18 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్త్రం తండాకు చెందిన జాటోతు పకీర సాలమ్మ దంపతుల కుమారుడు నరేష్ కొంతకాలం క్రితం మృతి చెందాడు. నరేష్‌కు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఆయన పేరుపై సుమారు 20 గుంటల భూమి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం నరేష్ భార్య దరఖాస్తు చేసుకోవడంతో, నరేష్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సర్టిఫికెట్ మంజూరు చేయవద్దంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినట్లు వారు పేర్కొన్నారు.అయితే, గతంలో రిజెక్ట్ చేసిన ఫైలును తిరిగి రీ-ఓపెన్ చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ మంజూరు చేయడంపై నరేష్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సర్టిఫికెట్ ఎలా మంజూరు చేశారని వారు ప్రశ్నించారు.“మాకు న్యాయం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకున్నారు? మా కుమారుడి మృతికి సంబంధించిన విషయాలు, కుటుంబ పరిస్థితులు పూర్తిగా తెలుసుకోకుండానే సర్టిఫికెట్ ఎలా మంజూరు చేస్తారు?” అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.“మా కడుపు కాలుతున్న బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు. మా పిల్లల భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు. మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సర్టిఫికెట్ మంజూరు చేయడం మాకు తీవ్ర అన్యాయం” అని వారు వాపోయారు.ఫ్యామిలీ సర్టిఫికెట్ మంజూరులో తమ అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అధికారులు స్పష్టత ఇవ్వాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

