హైదర్ సాయిపేట–సిరోలు మధ్య రహదారి నిర్మాణంతో వేలాది మంది ప్రజలు, రైతులకు ప్రయోజనం
తిరుమలాయపాలెం ఆగస్టు 17 (నమస్తే న్యూస్ ) తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజావాణి కాస్త సమస్యల వానిగా మారింది. ప్రజావాణి ప్రజలు వివిధ రకాల సమస్యలతో ప్రజావాణిలో అధికారులకు అర్జీలు దాఖలు చేసినారు అందులో ప్రధానంగా ఆకేరు నది పై బ్రిడ్జి నిర్మించి హైదర్ సాయిపేట నుంచి సిరోలు వరకు రహదారి సౌకర్యం కల్పించాలని ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.ఆకేరు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న రైతులు, గ్రామీణ ప్రజలు రాకపోకలకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, పంటలను మార్కెట్లకు తరలించే సమయంలో అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.బ్రిడ్జి నిర్మాణం జరిగితే మూడు జిల్లాలకు ప్రయోజనం..హైదర్ సాయిపేట–సిరోలు మధ్య ఆకేరుపై బ్రిడ్జి నిర్మించి రహదారి ఏర్పాటు చేస్తే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని మందడి ఇజ్రాయిల్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల మధ్య దూరం తగ్గడంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవలు పొందే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఒక బ్రిడ్జి నిర్మాణంగా కాకుండా మూడు జిల్లాలను అనుసంధానించే కీలక రవాణా మార్గంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పరిగణించాలని కోరారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపాలిఖమ్మం జిల్లా ప్రజల సమస్యలపై స్పందించే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని మందడి ఇజ్రాయిల్ విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, బ్రిడ్జి నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరారు.ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి, హైదర్ సాయిపేట నుంచి సిరోలు వరకు రహదారి నిర్మాణాన్ని చేపడితే ఈ ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.“ఇది ఒక గ్రామానికి సంబంధించిన సమస్య కాదు.. మూడు జిల్లాల ప్రజల రవాణా భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలి” అని మందడి ఇజ్రాయిల్ కోరారు.

