తిరుమలాయపాలెం, ఆగస్టు 17 ( నమస్తే న్యూస్ ) తిరుమలాయపాలెం మండలం లోని జూపెడ నుంచి లక్ష్మీదేవిపల్లి తండా మీదుగా వయా హస్నాబాద్ సుబ్లేడ్ వరకు ఉన్న నక్షలో నమోదైన రెండున్నర కిలోమీటర్ల రహదారిని వెంటనే పునరుద్ధరించాలని జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో జూపెడ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి , ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ కు వినతిపత్రం అందజేశారు. రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్తులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నక్షలో నమోదైన రహదారిని సంబంధిత అధికారులు పరిశీలించి, త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.

