హౌస్ ట్యాక్స్ భారం తగ్గించాలి.
మోడల్ మార్కెట్ ప్రారంభించాలి.
మండల స్థాయి ప్రజా వానిలో పిర్యాదు.
సిపిఐ జిల్లా సమితి సభ్యులు అబ్దుల్ రషీద్ డిమాండ్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 17(నమస్తే న్యూస్).మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను ప్రభుత్వం,సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ మండల స్థాయి ప్రజా వాణిలో డిమాండ్ చేశారు.
సామాన్య ప్రజలపై హౌస్ ట్యాక్స్,ప్రాపర్టీ ట్యాక్స్ భారం అధికంగా ఉన్నదని, పన్ను విధానాన్ని సమగ్రంగా పునఃపరిశీలించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.ఇతర మున్సిపాలిటీల్లో అమలవుతున్న పన్ను విధానాలతో పోల్చి మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పన్నుల విధానాన్ని పారదర్శకంగా సమీక్షించాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులు,కాలనీలు,అంతర్గత వీధుల్లో సీసీ రోడ్లు లేకపోవడం,ఉన్న రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్త సీసీ రోడ్లు నిర్మించాలని,దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు నిలిచిపోతోందని,దుర్వాసన,దోమల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైనేజీలను పూర్తిస్థాయిలో పరిశీలించి పూడిక తొలగించడంతో పాటు,అవసరమైన చోట కొత్త డ్రైనేజీలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.దోమల నివారణ చర్యలు చేపట్టాలని వర్షాకాలం సీజనల్ వ్యాదులు వ్యాపించకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని, అలాగే మరిపెడ బంగ్లా అంగడి ఆవరణలో,చెరువు కట్టపై చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాపారులు,రైతులు,వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. అంగడి ఆవరణను,చెరువు దగ్గర వేస్తున్న చెత్తను క్రమం తప్పకుండా శుభ్రం చేయించి,చెత్తను వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మల్లి అంగడిలో,చెరువు గట్టుపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజాధనంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మోడల్ మార్కెట్‌ను వెంటనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను మోడల్ మార్కెట్లోకి తరలించి,రైతులు,కూరగాయల వ్యాపారులు,వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మోడల్ మార్కెట్ నిర్మాణానికి ప్రజాధనం ఖర్చు చేసినందున దానిని నిరుపయోగంగా ఉంచకుండా వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మరిపెడ బంగ్లా మండలంలోని ప్రజల సమస్యలను ఎంపీడీవో,ఎంఆర్ఓ,మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి,సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని కోరారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి,సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మార్కెట్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు.

