వెల్లంకి పాఠశాలలో గంజాయి, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన
రామన్నపేట,ఆగస్టు17(నమస్తే న్యూస్)
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రామన్నపేట ఎస్సై సతీష్ సూచించారు. మండలంలోని వెల్లంకి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నకిరేకంటి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం గంజాయి, మత్తు పదార్థాలు, బెట్టింగ్ యాప్స్, సెల్‌ఫోన్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నపేట ఎస్సై (ఎస్హెచ్ఓ) సతీష్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మత్తు పదార్థాలు మనిషిని గొప్పవాడిని చేయవని, జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌ను విద్యా సంబంధిత అవసరాలకు మాత్రమే వినియోగించాలని, బెట్టింగ్ యాప్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.గంజాయిని కొందరు చాక్లెట్ల రూపంలో కూడా విద్యార్థులకు అందించే అవకాశం ఉందని, అపరిచితులు ఇచ్చే పదార్థాలను తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మందు, సిగరెట్, గంజాయి, ఇతర డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే 112 లేదా 100కు సమాచారం అందించాలని విద్యార్థులకు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా తమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, వార్డు సభ్యుడు గంజి భాస్కర్, దివ్యాంగుల పోరు రాష్ట్ర అధ్యక్షుడు నకిరేకంటి అశోక్, ఇడెం శ్రీనివాస్, ఆటిపాముల పెద్దలు, పాఠశాల ఇన్చార్జి సత్తిరెడ్డి తదితరులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.నీ జీవిత లక్ష్యం చదువు.. నీ భవిష్యత్తు మత్తు కాదు. నీ మనసు లక్ష్యం వైపు, నీ బుద్ధి విజయం వైపు, నీ ఆలోచనలు భవిష్యత్తు వైపు, నీ అడుగులు విజయపథం వైపు ఉండాలి అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. మత్తుకు బానిసై జీవితాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లకుండా, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సమాజంలో గుర్తుండిపోయే స్థాయికి ఎదగాలని సూచించారు.కార్యక్రమంలో గ్రామ నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

