బెల్ట్ షాపులు మూసేయాలి.. యువతను కాపాడాలి

రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 16 (నమస్తే న్యూస్): బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక దళితవాడలో సారాయి, మద్యం, బెల్ట్ షాపులను పూర్తిగా బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు, యువకులు, కాలనీ పెద్దలు ఐక్యంగా ఉద్యమించారు. వాడలోని ప్రతి వీధిలో డప్పు చాటింపుతో తిరుగుతూ మద్యం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.మద్యం, సారాయి కారణంగా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరుగుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం వల్ల మహిళలు, పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా మద్యం విక్రయాలను అరికట్టాలని కోరారు.యువత మద్యానికి బానిస కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా బెల్ట్ షాపులను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు.మద్యం వద్దు.. ఆరోగ్యమే ముద్దు.. బెల్ట్ షాపులు మూసేయాలి.. యువతను కాపాడాలి” అంటూ మహిళలు, యువకులు నినాదాలు చేశారు.మా వాడలో సారాయి వద్దు.. బెల్ట్ షాపులు వద్దు.. మా కుటుంబాల భవిష్యత్తు కావాలి” అంటూ నినదించారు.ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి మద్యం వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మద్యం విక్రయాలను అరికట్టి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
