కుల బహిష్కరణ బెదిరింపులతో వణుకుతున్న కుటుంబం
గత దాడుల కేసులు..
మళ్లీ ముప్పు ఉందంటున్న మద్దిరాల వీరస్వామి
ఉన్నతాధికారుల జోక్యంతోనే న్యాయం జరుగుతుందంటున్న బాధితులు
దంతాలపల్లి, ఆగస్టు 16(నమస్తే న్యూస్):
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.. మాకు ప్రాణభయం ఉంది.. మా కుటుంబాన్ని కాపాడండి అంటూ దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన మద్దిరాల వీరస్వామి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తమపై పలుమార్లు దాడులు జరిగాయని, ఈ ఘటనలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదయ్యాయని వీరస్వామి తెలిపారు. ప్రస్తుతం మళ్లీ తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కుల బహిష్కరణ పేరుతో బెదిరింపులు
తమ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తామని కొందరు బెదిరిస్తున్నారని వీరస్వామి ఆరోపించారు. కుటుంబ సభ్యులతో అనుచితంగా మాట్లాడటంతో పాటు భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.మా కుటుంబం ఏ తప్పు చేసింది? మాకు ప్రశాంతంగా జీవించే హక్కు లేదా?” అంటూ వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎవరితోనూ గొడవలు లేకపోయినా కావాలనే వివాదాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
తమపై జరుగుతున్న బెదిరింపులు, వేధింపులపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వీరస్వామి తెలిపారు. గతంలో నమోదైన కేసులు, ప్రస్తుతం ఎదురవుతున్న బెదిరింపులపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు.బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రాణహాని ఉన్నట్లు నిర్ధారణ అయితే కుటుంబానికి తక్షణ భద్రత కల్పించాలని, బెదిరింపులు లేదా దాడులకు పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

