తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్ ) తిరుమలయపాలెం వైద్య విధాన పరిషత్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కృపా ఉషశ్రీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి జాతీయ గీతం జనగణమనను ఆలపించారు.ఈ సందర్భంగా డాక్టర్ కృపా ఉషశ్రీ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే పేదలు, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగితో ఆప్యాయంగా వ్యవహరిస్తూ, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


