
టెహ్రాన్: హోర్ముజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ జలమార్గం తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. హోర్ముజ్‌ను త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.హోర్ముజ్ జలసంధిని అమెరికా ట్వీట్‌తోనో, విమానంతోనో స్వాధీనం చేసుకోలేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ వ్యాఖ్యానించారు. అమెరికా ఓటమిని అంగీకరించే వరకు జలమార్గ దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. హోర్ముజ్‌లో తిరిగి హింస చెలరేగడానికి అమెరికా సైనిక చర్యలే కారణమని ఆరోపించారు. శాశ్వత శాంతి కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమెరికాతో చర్చలకు తిరిగి వెళ్లే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందినట్లు సమాచారం. అన్సార్, దేర్ ఎజ్-జహ్రానీ ప్రాంతాలపై జరిగిన దాడులను లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను ఆయన ‘మారణకాండ’గా అభివర్ణించారు.ఇజ్రాయెల్ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్ ఆరోపించారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని హిజ్బొల్లా పేర్కొంది.ఇక హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులపైనా ఉద్రిక్తత నెలకొంది. తమ ప్రభుత్వ చమురు సంస్థ ADNOCకు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసిందని యూఏఈ ఆరోపించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని తెలిపింది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా, ఎలాంటి షరతులు లేకుండా తిరిగి తెరవాలని ఇరాన్‌ను యూఏఈ డిమాండ్ చేసింది.3ఇదిలా ఉండగా.. ఇరాన్లో ఇద్దరు ఫ్రెంచ్ దౌత్యవేత్తలు ‘చొరబాటు, జోక్యం’ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలను ఇరాన్ వెల్లడించలేదని, వాటిని స్వతంత్రంగా ధ్రువీకరించలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.మొత్తంగా హోర్ముజ్ జలసంధి, ఇరాన్-అమెరికా సంబంధాలు, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

