సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించారా?
వాషింగ్టన్: అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధనౌకలో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది నావికులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తొమ్మిది నెలలుగా సముద్రంలో విధులు నిర్వహిస్తుండటంతో ఆహారం, నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.నౌకలో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో కొందరు నావికులు మానసికంగా తీవ్రంగా కుంగిపోయారని, మరికొందరు సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే నావికుల్లో మానసిక ఆరోగ్య సంక్షోభం నెలకొందన్న వార్తలను అమెరికా నావికాదళం ఖండించింది.ఇదిలా ఉండగా.. అబ్రహాం లింకన్ స్థానంలో మరో విమానవాహక యుద్ధనౌకను మిడిల్ ఈస్ట్‌కు పంపేందుకు అమెరికా సిద్ధమైంది. యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం పసిఫిక్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ మలేసియా సమీపంలో ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ వైపు బయలుదేరిన ఈ నౌక మరో తొమ్మిది రోజుల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.నావికుల విధులను మరీ ఎక్కువ కాలం పొడిగించారన్న వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. నౌకలో సిబ్బంది ఎక్కువ కాలం విధుల్లో ఉన్నారన్నది పెద్ద సమస్య కాదని, “ఇది ఏమంత ఎక్కువ కాలం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు.అబ్రహాం లింకన్ స్థానంలో మరో యుద్ధనౌకను పంపుతున్న విషయాన్ని ట్రంప్ ధ్రువీకరించినప్పటికీ.. ఆ నౌక పేరును మాత్రం వెల్లడించలేదు. మరోవైపు నావికుల సంక్షేమంపై వారి కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ఆందోళన మాత్రం కొనసాగుతోంది.

