రిపోర్టర్: పిల్లల నరసింహారావు
సెంటర్: గుండాల.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు15(నమస్తే న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు హాజరై మాట్లాడారు.గుండాల ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS)లో ఆదివాసి విద్యార్థులతో పాటు లంబాడ విద్యార్థులు కూడా విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థులందరి సంస్కృతి, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు.అయితే గుండాల EMRSలో తీజ్ పండగను నిర్వహించడం ద్వారా ఒక వర్గానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలను ఆదివాసి విద్యార్థులపై ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆరోపించింది. ఆదివాసి విద్యార్థులలో తమ స్వంత సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచాల్సిన సమయంలో ఇతర సంస్కృతులను ప్రోత్సహించడం సరికాదని పేర్కొంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత EMRS అధికారుల నుంచి తీజ్ పండగ నిర్వహణకు ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయా అనే విషయాన్ని స్పష్టం చేయాలని, ఆదేశాలు లేకుండా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లయితే బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.ప్రస్తుతం లంబాడ–ఆదివాసి రిజర్వేషన్ అంశంపై వివిధ స్థాయిల్లో చర్చలు, ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థుల మధ్య అనవసరమైన వివాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది.అదేవిధంగా EMRS విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంఘం కోరింది. విద్యార్థులు చదువులో వెనుకబడకుండా, పాఠశాల నుంచి టీసీలు తీసుకుని వెళ్లే పరిస్థితులు లేకుండా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించింది.పండగలు, సాంస్కృతిక కార్యక్రమాల కంటే విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. విద్యార్థుల విద్యా భవిష్యత్తు, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.గుండాల EMRSలో నిర్వహించిన తీజ్ పండగ కార్యక్రమంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యత వహించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది.తమ డిమాండ్‌పై అధికారులు తక్షణమే స్పందించకపోతే, ఆదివాసి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆదివాసి సమాజాన్ని సమీకరించి పాఠశాల ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతామని ఆదివాసి సంక్షేమ పరిషత్ హెచ్చరించింది.

